కోఠిలో గన్‌తో కాల్పులు…
రూ.6 లక్షల దోపిడీ

హైదరాబాద్, జనవరి 31, 2026 (విశ్వం న్యూస్) : కోఠి ప్రాంతంలో ఉదయం జరిగిన గన్ దాడి, దోపిడీ ఘటన నగరాన్ని ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. ఉదయం 7 గంటల సమయంలో ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు స్కూటీపై వెళ్తున్న రషీద్ అనే వ్యక్తిని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. ముందుగా అతడిని బెదిరించి తన వద్ద ఉన్న నగదును ఇవ్వాలని ప్రయత్నించారు. రషీద్ నిరాకరించడంతో దుండగులు అతని వద్ద ఉన్న సుమారు రూ.6 లక్షల నగదును లాక్కొని గన్‌తో కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో రషీద్‌కు కాలికి బులెట్ గాయం కాగా, ఘటన స్థలంలో రెండు బులెట్లు లభ్యమయ్యాయి. తీవ్రంగా గాయపడిన రషీద్‌ను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కాల్పుల అనంతరం దుండగులు అదే స్కూటీపై అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రద్దీ ప్రాంతంలో, అది కూడా ఉదయం వేళ జరిగిన ఈ దారుణ ఘటనతో కోఠి ప్రాంతం ఉలిక్కిపడింది.

గతంలో కూడా పట్టపగలు చందానగర్‌లోని ఖజానా జ్యువెల్లర్స్ షాపులోకి చొరబడిన దుండగులు గన్‌తో కాల్పులు జరిపి డబ్బులు, విలువైన బంగారు నగలను దోచుకెళ్లిన ఘటనలు చోటుచేసుకున్నాయి. విశ్వనగరంగా ఎదుగుతున్న నగరంలో గన్ కల్చర్ పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజల భద్రతపై పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.