
విశ్వం న్యూస్ / హైదరాబాద్, ఆగస్టు 9: తెలంగాణలో వర్షాలు కురుస్తున్న వేళ, భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ్టి (శనివారం) నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు వర్షాలపై సూచనలు, హెచ్చరికలను ప్రకటన ద్వారా విడుదల చేసింది.

ఆదిలాబాద్, కొమరంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
అలాగే 12, 13, 15 తేదీల్లో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడివుండే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేసింది. కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని, పోలీసులు సహా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచించింది.