వారందరికీ ఏప్రిల్ 9, 23, 29 తేదీల్లో సెలవు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన!

ఇతర రాష్ట్రాల ఉద్యోగులకు గుడ్ న్యూస్:
ఓటింగ్ కోసం జీతంతో సెలవులు

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విశ్వం న్యూస్) : దేశంలోని పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నివసిస్తూ ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్న ఇతర రాష్ట్రాల ఓటర్లకు తమ స్వస్థలాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక పెయిడ్ సెలవులను ప్రకటించింది.

కార్మిక, ఉపాధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ సెలవులు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ సంస్థలు, ఫ్యాక్టరీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు కూడా వర్తిస్తాయి. పోలింగ్ రోజున ఓటు వేయడానికి వెళ్లే ఉద్యోగులు, కార్మికుల జీతాల్లో ఎలాంటి కోత విధించరాదని యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ఓటర్లకు ఏప్రిల్ 9న సెలవు ప్రకటించగా, తమిళనాడు ఓటర్లకు ఏప్రిల్ 23న ప్రత్యేక సెలవు ఇవ్వనుంది. పశ్చిమ బెంగాల్‌లో దశల వారీగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, అక్కడి ఓటర్లకు ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో సెలవులను కేటాయించింది.

ఓటర్ల పాల్గొనే శాతాన్ని పెంచడం, ప్రజాస్వామ్య హక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *