
హైదరాబాద్, ఆగస్టు 24 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ మేడిపల్లిలో జరిగిన దారుణ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా షాక్‌కు గురి చేస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న మహేందర్ రెడ్డి – స్వాతి దంపతుల మధ్య పెళ్లయినప్పటి నుంచి తరచూ గొడవలు జరిగేవి. చిన్న చిన్న విషయాలకే విపరీతంగా తగవులు పడుతూ వచ్చిన ఈ జంట, చివరికి భయంకరమైన పరిణామానికి దారి తీసింది.

ఈ నెల 22న మళ్లీ భర్త–భార్యల మధ్య పెద్ద గొడవ జరిగింది. గతంలో స్వాతికి అబార్షన్ చేయించగా, ఇప్పుడు మళ్లీ గర్భవతి కావడంతో మెడికల్ చెకప్‌కు తీసుకెళ్లమని ఆమె అడిగింది. దీనిపై రగిలిపోయిన మహేందర్ రెడ్డి, చెలరేగి భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఇది ఒక్కసారిగా చేసిన పని కాదు. ముందుగానే బోడుప్పల్‌లో హాక్సా బ్లేడ్ కొనుగోలు చేసి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం స్వాతి శరీరాన్ని ముక్కలుగా కోసి, కవర్లలో నింపి, విడతల వారీగా మూసీ నదిలో పడేయడానికి ప్రయత్నించాడు.
తలను ఒక కవర్‌లో పెట్టాడు.
చేతులు, కాళ్లను వేరుగా కట్ చేసి పెట్టాడు.
మొత్తం శరీరాన్ని మాయం చేయాలని ప్లాన్ చేశాడు.
హత్య చేసిన తర్వాత తన చెల్లికి కాల్ చేసి “స్వాతి కనిపించడం లేదు” అని చెప్పాడు. బావ కూడా ఇంటికి వచ్చి చూసి అనుమానం వ్యక్తం చేశాడు. దాంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లయింట్ ఇవ్వాలని నాటకం ఆడాడు. అయితే, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌కి ఏదో గందరగోళం జరిగిందన్న అనుమానం కలిగింది. వెంటనే మహేందర్ రెడ్డిని ఇంటికి తీసుకెళ్లి వెతికినప్పుడు భయంకర నిజం బయటపడింది. తల–కాళ్లు–చేతులు లేని శవం ఇంట్లోనే దొరికింది. పోలీసులు తలను గుర్తించినప్పటికీ, మిగతా శరీర భాగాలు కోసం మూసీ నదిలో గాలిస్తున్నారు. కీలక ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. డీఎన్‌ఏ పరీక్షలతో మృతదేహం స్వాతిదేనని ధృవీకరించేందుకు చర్యలు చేపట్టారు.