
హైదరాబాద్, మార్చి 30 (విశ్వం న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు’పై కే.టి. రామారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లు పౌర స్వేచ్ఛలను హరించే ప్రమాదకర చట్టమని ఆయన పేర్కొన్నారు.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో, ప్రభుత్వం విమర్శకుల గొంతుకలను నొక్కేందుకే ఈ బిల్లును తీసుకొస్తోందని ఆరోపించారు. బిల్లులోని నిబంధనలు అస్పష్టంగా ఉండటం వల్ల అధికార దుర్వినియోగానికి అవకాశం ఉంటుందని అన్నారు.
‘వ్యతిరేక భావాలు ప్రేరేపించడం’, ‘సామాజిక సమగ్రతకు భంగం’ వంటి పదజాలానికి స్పష్టమైన నిర్వచనాలు లేకపోవడం వల్ల ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
అలాగే Shreya Singhal vs Union of India తీర్పును ప్రస్తావిస్తూ, హింసకు ప్రత్యక్ష ప్రేరణ ఉన్నప్పుడే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు.
బిల్లులో ప్రతిపాదించిన 7 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తాయని ఆయన అన్నారు. ఇప్పటికే ఉన్న చట్టాల మధ్య కొత్త చట్టం అవసరం ఏమిటని ప్రశ్నించారు.
ఈ బిల్లును వెంటనే పునర్విమర్శించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.