భార్య ఆత్మహత్యను వీడియో తీసిన భర్త

రాజంపేట, మార్చి 13 (విశ్వం న్యూస్): అన్నమయ్య జిల్లా రాజంపేటలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుండగా అడ్డుకోవాల్సిన భర్త, ఆమెను కాపాడటానికి ప్రయత్నించకుండా వీడియో తీయడం సంచలనం కలిగించింది.
రాజంపేట సమీపంలోని బోయినపల్లికి చెందిన రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి చెందింది. దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కృష్ణవేణి ఉరి వేసుకుంటానని భర్తను బెదిరించగా, ఎలా ఉరివేసుకోవాలో కూడా శ్రీనివాసులే చెప్పినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో ఉరి వేసుకునే ప్రయత్నంలో కృష్ణవేణి చీర మెడకు చుట్టుకుని నిజంగానే ఉరి పడి ప్రాణాలు కోల్పోయింది. ఘటన సమయంలో ఆమెను కాపాడాల్సిన భర్త మాత్రం వీడియో తీసినట్లు సమాచారం.
శ్రీనివాసులకు కృష్ణవేణి రెండో భార్య అని బంధువులు చెబుతున్నారు. కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేసి అతనిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న రాజంపేట రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.