హుస్సేన్ సాగర్ శుద్ధి కాలేదు… మరి మూసీ సుందరీకరణ ఎలా?

- ప్రభుత్వ ప్రణాళికలపై అనుమానాలు – ప్రాథమిక సమస్యల పరిష్కారం ఎక్కడ?
హైదరాబాద్, మార్చి 8 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ నగర అభివృద్ధి పేరుతో మూసీ నది సుందరీకరణపై ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రణాళికలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. నగర చరిత్రను పరిశీలిస్తే, శతాబ్దాలుగా రాత్రిళ్లు వెలుగులతో కళకళలాడిన హైదరాబాద్ తన సహజ వనరుల వల్లే అభివృద్ధి చెందింది. అయితే కాలక్రమేణా నిర్లక్ష్యం, కాలుష్యం కారణంగా నగరంలోని నీటి వనరులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
మూసీ నది చుట్టూ నగరం అందంగా ఉండాలంటే ముందుగా ఆ నది పరిసరాల్లో ప్రజలు ముక్కు మూసుకోకుండా నడిచే పరిస్థితి రావాలి. కానీ వాస్తవానికి మూసీలో ప్రవహిస్తున్న మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
ఇప్పటికే నగర మధ్యలో ఉన్న చిన్న పరిమాణంలోని హుస్సేన్ సాగర్ సరస్సును పూర్తిగా శుద్ధి చేయడంలో ప్రభుత్వాలు గత రెండు దశాబ్దాలుగా విఫలమయ్యాయి. అలాంటి పరిస్థితిలో విస్తారమైన మూసీ నదిని సుందరీకరించడం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.
మూసీ సుందరీకరణ చేపట్టాలంటే కొన్ని ప్రాథమిక అంశాలకు ముందుగా పరిష్కారం చూపాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మూసీలో కలిసే మురుగు నీటి ప్రవాహానికి ప్రత్యామ్నాయం ఏమిటి? పారిశ్రామిక వ్యర్థాలను ఎలా నియంత్రిస్తారు? మూసీ ప్రక్షాళనకు సమగ్ర ప్రణాళిక ఏమిటి? వంటి ప్రశ్నలకు స్పష్టత అవసరమని అభిప్రాయపడుతున్నారు.
అంతేకాకుండా, పైలట్ ప్రాజెక్టుగా కనీసం నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల వరకు అయినా మూసీలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చేసి తర్వాత పెద్ద ప్రణాళికలు చేపట్టాలని సూచనలు వస్తున్నాయి. దశలవారీగా కాకుండా ఒకేసారి పెద్ద ఎత్తున చేపట్టాలంటే భారీ బడ్జెట్ అవసరం అవుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ప్రతి నెల రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంలోనే రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించిన నేపథ్యంలో, మూసీ సుందరీకరణ వంటి భారీ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక, ఆర్థిక వనరులు మరియు కాలుష్య నియంత్రణ చర్యలపై సమగ్ర వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నారగోని ప్రవీణ్ కుమార్
(సామాజిక కార్యకర్త)