హిందూ–ముస్లిం ఐక్యతకు ప్రతీకగా ఇఫ్తార్ విందు: ఏసీపీ మాధవి

హిందూ–ముస్లిం ఐక్యతకు
ప్రతీకగా ఇఫ్తార్ విందు: ఏసీపీ మాధవి

హుజురాబాద్, మార్చి 20 (విశ్వం న్యూస్) : రంజాన్ మాసం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, హుజురాబాద్ ఏసీపీ మాధవికి ఖర్జూరం తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ రంజాన్ పండుగను అందరూ ప్రశాంతంగా, సోదరభావంతో జరుపుకోవాలని సూచించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు మతాలకు చెందిన ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి అన్ని పండుగలను జరుపుకోవాలని తెలిపారు. గంగా–జమున తహజీబ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పరస్పరం పండుగలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్నేహభావంతో జీవించాలని ఆమె ఆకాంక్షించారు. అలాగే శనివారం జరగనున్న ఈద్-ఉల్-ఫితర్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హిందూ–ముస్లిం సోదరభావం బలంగా కొనసాగుతోందని చెప్పారు. ఒకరి పండుగలకు మరొకరు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకోవడం, పెళ్లిళ్లు వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సంప్రదాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో అన్ని పండుగలను ప్రజలు కలిసి మెలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *