టోలీచౌకి ప్రమాదానికి అక్రమ నిర్మాణాలే కారణం: దాసోజు శ్రవణ్

హైదరాబాద్, మార్చి 5 (విశ్వం న్యూస్): హైదరాబాద్ టోలీచౌకి కాలనీలో ఏడవ అంతస్తు నుంచి ఇద్దరు కిందపడిపోవడంతో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డు మీద ఉన్న ఆటో, కారులో ఉన్న వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడడం ఆందోళనకరమని పేర్కొన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

300 గజాలు కూడా లేని స్థలంలో ఏడు అంతస్తుల భవనం నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారో జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. నగరంలో విస్తృతంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. లంచాలు తీసుకుంటూ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు.
ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు, నిర్మాణ ప్రమాదాలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. పేదల ఇళ్లను కూల్చడంలో బిజీగా ఉన్న ప్రభుత్వం, పెద్దఎత్తున జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మాత్రం మౌనం పాటిస్తోందని మండిపడ్డారు.
టోలీచౌకి ఘటనపై హైడ్రా అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.1 కోటి నష్టపరిహారం ప్రకటించాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై తప్ప ప్రజల ప్రాణాల భద్రతపై శ్రద్ధ లేదని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసిందని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ విమర్శించారు.