హిమాయత్‌సాగర్‌లో అక్రమ మైనింగ్… ‘మరో KGF’లా దోపిడీ: దాసోజు

హిమాయత్‌సాగర్‌లో అక్రమ మైనింగ్…
‘మరో KGF’లా దోపిడీ: దాసోజు

హైదరాబాద్, మార్చి 5 (విశ్వం న్యూస్) : హిమాయత్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్, క్రషర్ యూనిట్ల కార్యకలాపాలపై బీఆర్‌ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పరిశీలన నిర్వహించినట్లు ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తెలిపారు. హిమాయత్‌సాగర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 66, 67, 68, 69లో నడుస్తున్న క్రషర్ యూనిట్లను బృందం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ అక్కడి పరిస్థితులు చూస్తుంటే “మరో KGF”ను తలపిస్తున్నాయని అన్నారు. కొండలను బద్దలు కొట్టి ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాంతం ట్రిపుల్ వన్ (GO–111) పరిధిలోకి వస్తుందని, ఇక్కడ ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు జరగకూడదని స్పష్టం చేశారు. అయినప్పటికీ అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా క్రషర్ యూనిట్లు నడుస్తున్నాయని ఆరోపించారు.

క్రషర్ యూనిట్లకు మైనింగ్ లీజు, క్వారీ పర్మిట్, గ్రామ పంచాయతీ ఎన్‌వోసీ, పర్యావరణ అనుమతులు వంటి అనేక అనుమతులు తప్పనిసరి అయినప్పటికీ ఈ ప్రాంతంలో నడుస్తున్న యూనిట్లకు సరైన అనుమతులు లేవని పేర్కొన్నారు. ఎప్పుడో మూతపడిన క్రషర్ యూనిట్‌ను మళ్లీ ప్రారంభించారని, దానికి లీజు ట్రాన్స్‌ఫర్ ఎవరు చేశారు? ఎవరు అనుమతి ఇచ్చారు? అనే విషయాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ఓఆర్‌ఆర్‌కు కిలోమీటర్ పరిధిలో మైనింగ్ కార్యకలాపాలు ఉండకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ ఇక్కడ సమీపంలోనే క్రషర్ యూనిట్లు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. రాజేంద్రనగర్ పరిధిలోని మానస హిల్స్ ప్రాంతంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్, రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ కూడా అసైన్డ్ భూముల్లోనే నడుస్తోందని ఆరోపించారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం అక్కడ సుమారు 8 లక్షల టన్నుల రాయిని తవ్వి తీసినట్లు తెలుస్తోందని, దీని వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జరిగిందని తెలిపారు. అక్రమ మైనింగ్‌పై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *