గాయత్రి విద్యా నికేతన్ లో స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన యూనిట్ ప్రారంభం
పెద్దపల్లి, జనవరి 21 (విశ్వం న్యూస్) : ఈ రోజు స్థానిక గాయత్రి విద్యా నికేతన్ లో దీక్షా స్వీకారోత్సవం ద్వారా నూతన స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ని అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా శిక్షణ పొందిన పలువురు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు శ్రీమతి జ్యోతి ( జిల్లా స్కౌట్స్ సెక్రటరీ), కె. వెంకటయ్య (హెచ్. డబ్ల్యు. బి) గారు, సోమారపు లావణ్య (జిల్లా వైస్ ప్రెసిడెంట్ , గైడ్ వింగ్), జొన్నల రవీందర్ ( పెద్దపల్లి జిల్లా స్కౌట్స్ కమిషనర్), సుందరి (జిల్లా ఆర్గనైజేషన్ కమిషనర్) తదితరులు బ్యాడ్జీలు, టోపీలు పెట్టి వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇ. సింగమ రాజు, సి. వి. జీవన్ రాజు లు స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది ఒక ఉద్యమం లాంటిది అనీ, దీనిని ఇలాగే దేశవ్యాప్తంగా విస్తరించాలని కోరారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ని బాల భటులు అంటారని, దీనివల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ, స్కౌట్స్ అండ్ గైడ్స్ వలన విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశ భక్తి, సామాజిక సేవ పట్ల ఆసక్తి, మానసిక, శారీరక, భౌతిక పరిపక్వత కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, పాఠశాల యూనిట్ లీడర్ దాడి స్రవంతి, ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.