
- అన్నపూర్ణ క్యాంటీన్ పేరును రద్దు చేయాలన్న నిర్ణయాన్ని దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. 373 క్యాంటీన్లలో 53 మూతపడ్డాయన్న GHMC నివేదికను ప్రస్తావిస్తూ… పేరు మార్చడం మానవత్వాన్ని అవమానపరచడమేనన్నారు. “అన్నార్తులకు అన్నం పెట్టే తల్లి పేరును తొలగించాలనుకోవడం ఘోర అపరాధం” అని అన్నారు.
హైదరాబాద్, జూన్ 28 (విశ్వం న్యూస్): “వినాశకాలే విపరీత బుద్ధి” అన్న పురాతన నానుడిని నిజం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి అంటూ బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. అన్నపూర్ణ క్యాంటీన్లను మూసివేసి, ఇప్పుడు వాటి పేరును తొలగించి కొత్త పేరు పెట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
“అన్నపూర్ణ పేరు లక్షలాది మంది గుండెల్లో భక్తిగా ఉంటుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే అమ్మ. అలాంటి పవిత్రమైన పేరును తొలగించాలన్న ఆలోచన పేదవారి మనోభావాలను కించపరచడమే కాదు, మానవత్వాన్ని అవమానపరచడమే” అని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం: మొత్తం 373 క్యాంటీన్లలో 53 కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయి. మిగతా 320 క్యాంటీన్లలో నిర్మాణ లోపాలు ఉన్నట్లు బయటపడిందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో క్యాంటీన్లను పునరుద్ధరించకుండా, పేరును మార్చాలనే తలంపు ప్రభుత్వానికి ఉన్న చేతకానితనానికి నిదర్శనమని ఆరోపించారు. “తెలంగాణ తల్లికి, రాజీవ్ గాంధీ విగ్రహానికి, కాకతీయ కళాతోరణానికి వరుసగా పంచాయితీలు పెట్టిన ప్రభుత్వం — ఇప్పుడు అన్నపూర్ణ తల్లి పేరుతో కూడా అదే చేస్తోందంటే… ఇది చిల్లర రాజకీయాలు, పనికిరాని పాలనకు ఉదాహరణ” అని శ్రవణ్ విమర్శించారు.
పేదలు, అనాధలు, అన్నార్తులకు అన్నం పెట్టే హక్కును తమ రాజకీయ ప్రయోజనాల కోసం మార్చడాన్ని మానవత్వంపై దాడిగా అభివర్ణించారు. “అన్నపూర్ణ పేరు తొలగించాలనే నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోండి” అంటూ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు.