
- నేను ఇక కాంగ్రెస్‌లో ఉండలేను.. జీవన్‌రెడ్డి సంచలన ప్రకటన
జగిత్యాల, మార్చి 22 (విశ్వం న్యూస్): కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమైనట్లు సంకేతాలు ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకోసం కష్టపడి పని చేసిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల తనకు తీవ్ర అవమానం, మానసిక క్షోభ కలిగిందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సార్థకమా అనే విషయంపై చర్చించేందుకు ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్డులోని బండారి గార్డెన్‌లో తన అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో తన భవిష్యత్ రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ తనకు జరిగిన పరిణామాలపై ఆత్మపరిశీలన అవసరమని, అందరి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.
జీవన్ రెడ్డి చేసిన ఈ ప్రకటనతో జగిత్యాల జిల్లా రాజకీయాల్లో చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత పరిస్థితులపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.