జోహార్ శ్రీకాంత్ చారి

జోహార్ శ్రీకాంత్ చారి

  • సరిగ్గా 15 సంవత్సరాల క్రితం తెలంగాణ మలిదశ ఉద్యమం ఒక్కసారిగా ఉవ్వెత్తునా ఎగిసింది అదే మన శ్రీకాంత్ చారి వీరమరణం (03-12-2009)

హైదరాబాద్, డిసెంబర్ 3 (విశ్వం న్యూస్) : ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంత ఉద్యమించినా.. ఎన్ని పోరాటాలు చేసినా.. ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రావట్లేదని తలచి.. తెలంగాణ తల్లికి తన అత్మార్పణంతోనైనా పాలకుల మనసుల్లో చలనం వస్తుందని భావించాడు. తన ఆత్మాహుతితోనైనా తెలంగాణ ఉధ్యమ జ్వాలలు హస్తినకు తగులుతాయని ఆకాంక్షించాడు.

2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ చౌరస్తాలో జరిగిన ధర్నాలో నడి రోడ్డు మీద.. అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. 2009 డిసెంబర్ 3 న శ్రీకాంతా చారి హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు..!!

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు వెంకటచారి, శంకరమ్మ దంపతులకు 1986 సంవత్సరంలో స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు15 తేదీన శ్రీకాంత్ జన్మించాడు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చిన శ్రీకాంత చారి.. తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్నాడు. మొదట బీజేపీలో ఉన్న శ్రీకాంత్.. అనంతరం టీఆర్ఎస్‌లో చేరి ఉద్యమ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నాడు. శ్రీకాంత చారి అగ్నికి ఆహుతవుతూ.. జై తెలంగాణ అంటూ నినదించిన దృశ్యాలు చూసి.. తెలంగాణలోని ప్రతీ ఒక్కరి గుండె రగిలింది. అప్పటి నుంచి ఉద్యమం మరో స్థాయికి చేరుకుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

శ్రీకాంత చారి చివరి శ్వాస వరకు ప్రత్యేక తెలంగాణను కాంక్షించాడంటే.. ఆయన కన్నా తెలంగాణ పుత్రుడు మరెవ్వరుంటారంటూ.. ఇప్పటికీ మేధావులు కొనియాడుతుంటారు. ఒకవేళ ఆరోజు బతికినా.. తెలంగాణ కోసం మళ్లీ చావడానికి సిద్ధం అంటూ ఆయన చివరి క్షణాల్లో చెప్పిన మాటలు తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ పదిలమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *