చోరీ చేసి పారిపోతూ ఫ్లైఓవర్
నుంచి దూకేశాడు (వీడియో)

హైదరాబాద్, జనవరి 14 (విశ్వం న్యూస్) : కొన్ని ఘటనలు చూస్తుంటే.. ఎదుటివాడు దొంగ అయిన సరే.. దొరికితే దూలతీరిపోయేలా బడితపూజ చేసే సందర్భమైనా సరే.. అరెరే ఎంతపనైపాయే.. అన్న ఫీలింగ్ కలుగుతుంది. అచ్చం అలాంటి ఫీలింగే కలుగుతుంది ఈ దొంగను చూస్తుంటే కూడా. హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలో ఓ దొంగకు వింత అనుభవం ఎదురైంది. కాగా.. అంబర్ పేటలో గత కొంత కాలంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇళ్లల్లో, దుకాణాల్లో దొంగతనం చేయటం అంతా సేఫ్ కాదనుకున్నాడో.. లేదా ఫ్లైఓవర్ సామాన్లు చోరీ చేస్తే అడిగేవాడు ఉండడనుకున్నాడో ఏమో.. ఫ్లైఓవర్ సామాన్లపై కన్నేశాడు.
పండుగ రోజు.. అందులోనూ నగరమంతా పల్లెకు వెళ్లిపోయింది.. ఎవరూ చూడరనుకుని ఫ్లైఓవర్ మీదున్న సామాను చోరీ చేశాడు. ఎవరూ చూడరనుకుని దర్జాగా ఉన్న ఆ దొంగను.. స్థానికులు చూసేశారు. చూసి ఊరికే ఉంటారా..? కేకలు వేశారు. దీంతో.. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా తప్పించుకోవాలనేది తోచలేదు. ఫ్లైఓవర్ మీది నుంచి భీమ్ మీదికి ఎలా వచ్చాడో కానీ.. అక్కడి నుంచి కిందికి ఎలా రావాలనేది మాత్రం అర్థకానట్టుంది. ఫ్లైఓవర్ భీమ్ పక్కనే ఓ చెట్టు ఉండగా.. దాన్ని పట్టుకుని కిందికి రావొచ్చనుకున్నాడు. చెట్టు కొమ్మలు పట్టుకుని సేఫ్‌గా ల్యాండ్ అవుతాననుకున్నాడు. కానీ.. ఆ చెట్టు కొమ్మలు అందలేదో.. మరి మనోడు కిక్కులో ఉన్నాడో తెలియదు కానీ.. చెట్టు సాయం లేకుండానే డైరెక్టుగా కింద ల్యాండ్ అయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన దొంగను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.