రోడ్డు ప్రమాదాల నియంత్రణ
కోసమే డ్రంకెన్ డ్రైవ్ లు

అడిషనల్ డిసిపి (శాంతిభద్రతలు) ఎస్. శ్రీనివాస్
కరీంనగర్ బ్యూరో, మే 5 (విశ్వం న్యూస్) : రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసమే పోలీస్ శాఖ డ్రంకెన్ డ్రైవ్ లను కొనసాగిస్తున్నదని అడిషనల్ డిసిపి (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్ అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్లనే ఎక్కువశాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన మందుబాబులు, వాహనాలు నడిపిన మైనర్ బాలలకు వారి కుటుంబసభ్యుల సమక్షంలో శుక్రవారం నాడు కమీషనరేట్ కేంద్రంలోని ఓపెన్ థియేటర్ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డిసిపి (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే పోలీసులు పట్టుకుంటారని తెలిసికూడా వాహనాలు నడుపడం సరైందికాదన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, కొందరు మృతి చెందుతుండగా, మరికొందరు తీవ్రగాయాలకు గురవ్వడం, మరికొందరు జీవచ్ఛవాలుగా మారి దుర్భర జీవితాలను గుడుపుతున్నారని చెప్పారు. మద్యంమత్తులో మెదడు పనిచేయక, శరీరం ఆధీనంలో ఉండక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి న్యాయస్థానాలు జరిమానాలతోపాటు జైలుశిక్షలు విధిస్తున్నాయని తెలిపారు.
రెండవసారి పట్టుబడిన వారి లైసెన్సుల రద్దుకు సిఫారసు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు పట్టుబడినట్లయితే సంబంధితశాఖలు, సంస్థలకు సమాచారం తెలియజేస్తామని తెలిపారు. మైనర్ బాలలకు వాహనాలిచ్చినట్లయితే సదరు వాహనాల యజమానుల పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మైనర్ బాలలు వాహనాలిచ్చే వాహన యజమానులపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారితో ఇలాంటి చర్యలు పునరావృతం కానీయమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి విజయకుమార్, ఇన్స్పెక్టర్ తిరుమల్ తోపాటుగా పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.