హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విశ్వం న్యూస్): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ ఆంజనేయ స్వామి భక్తి, బలం, జ్ఞానం, వాక్చాతుర్యం కలగలసిన అరుదైన వ్యక్తిత్వమని పేర్కొన్నారు. హిందూ పురాణాలలో హనుమంతుడిని “జ్ఞానినాం అగ్రగణ్యం”గా కీర్తించినట్టు తెలిపారు.

సంత్ తులసీదాస్ రామచరిత మానస్‌లో చెప్పిన భావాలను ప్రస్తావిస్తూ, హనుమంతుడు జ్ఞానంలో అత్యున్నతుడని వివరించారు. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు చెప్పినట్లుగా, దోషరహితమైన భాష, శుద్ధమైన ఉచ్చారణతో గొప్ప వక్తగా హనుమంతుడు నిలిచాడని కొనియాడారు.

ధర్మ రక్షణ కోసం, శ్రీరాముడిపై అపార భక్తితో తన శక్తినంతా వినియోగించిన మహావీరుడిగా, వినయానికి, విజయానికి మార్గదర్శిగా హనుమంతుడు నిలిచాడని కేసీఆర్ తెలిపారు. జ్ఞానం, బలం, భక్తి, వినయం సమ్మిళితమైన సంపూర్ణ వ్యక్తిత్వం హనుమంతుడిదేనని పేర్కొన్నారు.

హనుమంతుడి ఆచరణలు ఎల్లకాలం ఆదర్శప్రాయమని, యువత వాటిని అనుసరించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు శాంతి, సుభిక్షం కలగాలని, రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *