ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

హైదరాబాద్, మార్చి 8 (విశ్వం న్యూస్) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహిళాలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, ఉత్పత్తి సంబంధాల్లో పురుషులతో సమాన భాగస్వాములని ఆయన పేర్కొన్నారు. మహిళల పాత్ర సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమని ఆయన అన్నారు.

సంతానోత్పత్తి అనే అనివార్యమైన ధర్మాన్ని ప్రకృతి స్త్రీకి అప్పగించిందని, మానవ మనుగడను కొనసాగించే గొప్ప బాధ్యతను అనేక కష్టనష్టాలను భరించి మహిళలు నిర్వర్తిస్తున్నారని కేసీఆర్ కొనియాడారు. కుటుంబ వ్యవస్థను నిలబెట్టే ప్రధాన శక్తి మహిళేనని ఆయన అన్నారు.

ఆకాశంలో సగం భాగమైన మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు కల్పించినప్పుడే కుటుంబాభివృద్ధి సంపూర్ణమవుతుందని, అదే సమాజం, దేశం, ప్రపంచాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో మహిళల పాత్ర విశేషమని కేసీఆర్ గుర్తు చేశారు. అనంతరం స్వయంపాలనలో కూడా తెలంగాణ మహిళలు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్నారని చెప్పారు.

మహిళా సాధికారత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అమలు చేసిన పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలంటే ప్రభుత్వాలు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని కేసీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *