
హైదరాబాద్, జూలై 03 (విశ్వం న్యూస్): బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అనారోగ్యంతో గురువారం ఉదయం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన వారం రోజులుగా జలుబు, దగ్గు, తలనొప్పి, సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఉదయం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్ నుంచి కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసానికి వచ్చిన కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించబడ్డారు. ప్రస్తుతం వైద్యులు ఆయన్ను పరీక్షిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు త్వరలో అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.
కేసీఆర్ ఆసుపత్రిలో చేరిన వార్త వెలువడడంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తూ పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొనగా, మాజీ సీఎం త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు.