కేసీఆర్ తండ్రిలాంటి నాయకుడు: దాసోజు శ్రవణ్

కేసీఆర్ తండ్రిలాంటి నాయకుడు: దాసోజు శ్రవణ్

కొమురం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 2, 2026 (విశ్వం న్యూస్) : జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం కొమురం భీం పోరాడితే, నీళ్లు–నిధులు–నియామకాలు అనే నినాదంతో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ తండ్రిలాంటి నాయకుడని పేర్కొన్నారు. దేశంలో ఎవరూ ఊహించని సంక్షేమ పథకాలను ఆలోచించి అమలు చేసిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, 420 వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన రెండో రోజే “లంకె బిందెలు ఉన్నాయి” అని, ఆ తర్వాత “ఖాళీ బిందెలు ఉన్నాయి” అని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

హైడ్రా పేరుతో, ముసి నది పేరుతో స్కాంలకు పాల్పడుతున్న ప్రభుత్వం ఇదని ఆరోపించారు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం లేదని, జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదని, రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలు కాలేదని పేర్కొంటూ—ప్రజలను మభ్యపెట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీలేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కేసీఆర్‌పై బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనవసర అంశాలపై రాద్దాంతం చేస్తూ కాలయాపన చేస్తోందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసిన కేసీఆర్‌ను, సిట్ విచారణ పేరిట ఐదు గంటల పాటు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను నిలదీస్తున్నందుకే కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు.

గౌరవప్రదమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని దాసోజు శ్రవణ్ తెలిపారు. కేసీఆర్‌ను ఇబ్బందులకు గురి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి సాధించాలనుకుంటోందని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశంలో ఎక్కడా లేవని, రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడిందని, సంక్షోభం తాండవిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లు ఇవ్వకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

ఇంకా రెండున్నర సంవత్సరాల పాలన మిగిలి ఉందని, ఒళ్లు దగ్గర పెట్టుకుని పాలన చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరించారు. మొత్తం తెలంగాణ ప్రజానీకంతో చెలగాటం ఆడటం సరికాదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *