
- ప్రజల సంక్షేమం కోరుతూ ప్రకృతి మాతను ప్రార్థన
హైదరాబాద్, మార్చి 29 (విశ్వం న్యూస్) : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భవిష్యత్తు ఆశావహంగా ఉండాలని కోరుతూ, భరత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రకృతి మాతను ప్రార్థిస్తూ, సాగునీరు, తాగునీరు పుష్కలంగా లభించడంతో పాటు రైతులకు సమృద్ధిగా పంటలు పండేలా దీవించాలని ఆకాంక్షించారు.
రైతులకు ఉగాది ప్రత్యేకత
ఉగాది వ్యవసాయ నూతన సంవత్సరంగా నిలుస్తుందని, ఈ రోజున రైతన్నలు తమ వ్యవసాయ పనులను కొత్తగా ప్రారంభిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రకృతితో మమేకమై వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం, ప్రేమాభిమానాలతో పాల్గొనే అన్ని వర్గాలకు ఉగాది గొప్ప పర్వదినమని ఆయన అన్నారు.
ఉగాది – ఆది పండుగ
ప్రజల శ్రామిక సాంస్కృతిక జీవనంలో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందని కేసీఆర్ తెలిపారు. చెట్లు పచ్చగా చిగురిస్తూ, ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని కలుగజేస్తుందని, అదే ప్రజల జీవితాల్లోనూ నిండాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ చేపట్టి, వారి జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలని అభిలషించారు. అప్పుడే విశ్వావసు నామ సంవత్సరానికి సంపూర్ణత లభిస్తుందని కేసీఆర్ అన్నారు.