శబరిమల భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు ఆందోళన

శబరిమల భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు ఆందోళన

నవంబర్‌ 19 (విశ్వం న్యూస్): శబరిమలలో రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మండల–మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర ఆదివారం సాయంత్రం ప్రారంభమైన అనంతరం కొండపైకి భక్తులు భారీగా చేరుతుండగా, మంగళవారం క్యూ లైన్‌లో ఓ భక్తురాలు స్పృహ కోల్పోయి మృతి చెందడం ఆందోళనకు కారణమైంది.

ఆలయం తెరిచిన 48 గంటల్లోనే సుమారు 2 లక్షల మంది శబరిమల చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. భక్తులలో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉండడంతో రద్దీ నియంత్రణలో లోపాలు స్పష్టంగా కనిపించాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.

హైకోర్టు ప్రభుత్వాన్ని, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డును ప్రశ్నిస్తూ:

  • “భక్తులను ఒక్క నిమిషంలో 80 మంది చొప్పున దర్శనానికి పంపాల్సిన అవసరం ఏమిటి?”
  • “భక్తుల రద్దీపై ముందస్తు ఏర్పాట్లు ఆరు నెలల ముందే ఎందుకు చేయలేకపోయారు?”
  • “వర్చువల్ క్యూ స్లాట్లు తగ్గించకుండా రద్దీని ఎందుకు పెంచారు?”
    అని తీవ్రంగా ప్రశ్నించింది.

అదేవిధంగా, స్పాట్ బుకింగ్ ద్వారా భక్తుల సంఖ్యను నియంత్రించాల్సిన బాధ్యత అధికారులదేనని, కానీ ఆ విషయంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అదనంగా 10 వేల మంది భక్తులు అనుమతులేకుండా కొండపైకి ఎక్కినట్లు దేవస్వం బోర్డు ఒప్పుకోవడమే పరిస్థితి ఎంత ప్రమాదకరమో చూపిస్తోందని హైకోర్టు పేర్కొంది.

“జరిగకూడనిది జరిగితే బాధ్యత ఎవరిది?” అని కోర్టు ప్రశ్నిస్తూ, భక్తుల భద్రతకు ముప్పు కలిగించేలా అనవసర రద్దీని అధికారులు ప్రోత్సహించవద్దని స్పష్టం చేసింది.

ఈ మొత్తం అంశంపై శుక్రవారం లోపు పూర్తివివరణ సమర్పించాలని ప్రభుత్వం, దేవస్వం బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *