మూసీ బాధితులకు
కేటీఆర్ భరోసా

హైదరాబాద్, మార్చి 1 (విశ్వం న్యూస్): మూసీ ప్రక్షాళన పేరుతో ఇండ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు నిర్వహించిన దండి మార్చ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు. హైదరాబాద్‌లోని హైదర్‌షాకోట్, కేకే నగర్ ప్రాంతాల మూసీ బాధితులు చేపట్టిన ఈ పాదయాత్రలో ఆయన పాల్గొని బాధితులకు భరోసా కల్పించారు.

మూసీ ప్రక్షాళన పేరిట ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తున్నదని ఆరోపిస్తూ బాధితులు “సేవ్ మూసీ – సేవ్ హోమ్స్” నినాదాలతో భారీగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప నిర్వాసితులతో కేటీఆర్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇండ్ల కూల్చివేతల విషయంలో బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇండ్ల కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో మూసీ బాధితుల సమస్యను ప్రస్తావిస్తామని చెప్పారు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అందరం కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కేవలం ఇండ్లు కోల్పోతున్న వారు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. లేదంటే ఈ రోజు వారి ఇల్లు కూల్చితే, రేపు మరొకరి ఇల్లు కూడా కూల్చే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
పేదల ఇండ్లను కూల్చడం తగదని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. మూసీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఆందోళనలు, కన్నీటి గాథలే వినిపిస్తున్నాయని అన్నారు. బుల్డోజర్ల భయం నీడలో ప్రజలు బతుకుతున్నారని బాధితులు చెబుతున్నారని పేర్కొన్నారు. పేదల పొట్ట కొట్టి మూసీ ప్రక్షాళన చేస్తామనడం అన్యాయమని మండిపడ్డారు. ప్రతి బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.