జర్నలిస్ట్ శంకర్ ని పరామర్శించిన కేటీఆర్

జర్నలిస్ట్ శంకర్ ని
పరామర్శించిన కేటీఆర్

  • జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన హత్యాయత్నం వెనకనున్నది సీఎం రేవంత్ రెడ్డినే – కేటీఆర్
  • కొడంగల్ లో జరుగుతున్న రైతుల భూకబ్జాల పైన నిజాలు వెల్లడించినందుకే శంకర్ పైన దాడి
  • భవిష్యత్తులో శంకర్ కి హాని జరిగితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాల్సి వస్తుంది
  • జర్నలిస్ట్ శంకర్ ను తుర్కయంజాల్ లోని ఆయన ఇంటిలో పరామర్శించిన కేటీఆర్ మరియు BRS పార్టీ సీనియర్ నాయకులు
  • శంకర్ పై జరిగిన దాడి విషయంలో పోలీస్ అలసత్వాన్ని, ప్రభుత్వ పక్షపాత వైఖరిని ప్రధాన ప్రతిపక్షంగా ఎండగడతామని హెచ్చరించిన కేటీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విశ్వం న్యూస్) : కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు, ఆయనపై జరిగిన దాడికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించాలన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టు శంకర్ పైన ఎట్లాంటి హాని జరిగినా దాని పూర్తి బాధ్యులు రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ హెచ్చరించారు. కొడంగల్ లో రైతులకు సంబంధించిన భూముల కబ్జాల విషయాన్ని బయటకు తీసుకువచ్చినందుకే జర్నలిస్టు శంకర్ పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేశారన్నారు. నిజాలను నిర్భయంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న శంకర్ పైన, రాజ్యాన్ని అడ్డుపెట్టుకొని, పోలీసులను అడ్డుపెట్టుకొని అంతమొందించాలన్న ఈ ప్రభుత్వ ప్రయత్నం అదృష్టవశాత్తు విఫలమైందన్నారు. భవిష్యత్తులో శంకర్ పైన దాడులకు తెగబడితే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. శంకర్ పైన పకడ్బందీగా గత కొద్ది రోజులుగా రెక్కి నిర్వహించి మరీ పదుల సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ గుండాలు ఆయనను అంతమొందించే ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానికులు, సీసీ కెమెరాల సాక్ష్యంగా ఉండడంతో వారి కుట్ర ఫలించలేదన్నారు.

శంకర్ లేవనెత్తుతున్న ప్రశ్నలను తట్టుకోలేకనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన పైన దాడికి తెగబడిందని ఆరోపించారు. శంకర్ ను అంతమొందించేందుకు భౌతికంగా దాడి చేసినా, స్థానిక పోలీసులు హాత్యాయత్నం కేసు నమోదు చేయకుండా అలసత్వం పక్షపాతం చూపించారన్నారు. పోలీసుల పక్షపాత వైఖరిపైన ప్రధాన ప్రతిపక్షంగా అవసరమైన కార్యాచరణ చేపడతామన్నారు. ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాష్ట్ర డిజిపిని కేటీఆర్ కోరారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంపైన అడ్డగోలుగా మాట్లాడినా, ప్రభుత్వంపైన అనేక అసత్య ప్రచారాలు చేసినా, పది సంవత్సరాలపాటు ప్రభుత్వంలో ఉన్న ఏనాడు కూడా భౌతిక దాడులకు పాల్పడలేదని కేటీఆర్ గుర్తు చేశారు.

జర్నలిస్టు శంకర్ ను అంతమొందించే ప్రయత్నం చేసినా, గతంలో మాట్లాడిన జర్నలిస్టు సంఘాలు ఈరోజు మౌనంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. అయితే ఈ రోజు జర్నలిస్టు శంకర్ కి జరిగిన పరిస్థితి, రేపు అందరూ జర్నలిస్టులకు జరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించి ప్రభుత్వ అణచివేత చర్యలపైన స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు సాయంత్రం తుర్కయంజల్ లోని శంకర్ ఇంటికి వెళ్లిన కేటీఆర్, ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కేటీఆర్ వెంట పలువురు పార్టీ సీనియర్ నాయకులు శంకర్ని పరామర్శించి భరోసాని ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *