పనికిరాని ముఖ్యమంత్రిని పక్కన పెడదాం:భట్టి

షాద్ నగర్, మే 16 (విశ్వం న్యూస్) : షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాను 2023 – 24 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని నియోజకవర్గంలో లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను నిర్మించి తీరుతామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం చౌదరిగుడా మండలం లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ స్థలం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. టీపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ బృందంతో పాటు ప్రజానౌక గద్దర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 2024 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఈ సందర్భంగా లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణ జలాల్లో మన పాలమూరు రంగారెడ్డి వాటాను నిర్ధారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం అని ఆ నీళ్లు దక్కకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని అన్నారు. కృష్ణాజిల్లాలో పాలమూరు రంగారెడ్డి నల్లగొండకు వాటా తేల్చుతూ మన వాటా మనం తీసుకోవాల్సిందేనని అన్నారు. ఈ పనికిరాని ముఖ్యమంత్రిని పక్కన పెడితే తప్ప నియోజకవర్గం అభివృద్ధి కాదని అన్నారు. రాష్ట్ర సంపదను అడ్డంగా దోచుకుంటున్న కేసీఆర్ పాలనను దూరం పెట్టాలని పిలుపునిచ్చారు.

రిజర్వాయర్ సమస్య ఒకటే కాకుండా ఇంకా ఇతర సమస్యలను కూడా తన దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా పరిష్కరిస్తామని అన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రెండు లక్షల రుణమాఫీ ఏక కాలలో ప్రయోజనం పొందేటట్టు చూస్తామని అన్నారు. అనాదిగా భూములు అనుభవిస్తున్న పేదల భూములను తెలంగాణ ప్రభుత్వం లాక్కుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నారని అన్నారు. పేదల భూములను లాక్కుంటే పుట్టగతులు లేకుండా పోతారని అన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేయడం లేదని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయభేరి మోగించిందని ఇక్కడ కూడా తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యం వస్తుందని ఇటు నుంచి ఛత్తీస్గడ్, రాజస్థాన్ వయా ఢిల్లీ కోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అన్నారు. ప్రజానాక గద్దర్ మాట్లాడుతూ ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వాన్ని పొడిచి దించాలని సూచించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కు సంబంధించి ఆయన పాటల రూపంలో పాడారు. భూమికి పచ్చని రంగేసినట్టు అంటూ తన గలం విప్పారు. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పాలకులకు ఇంకిత జ్ఞానం లేదని అన్నారు. ఇప్పటికే ఐదు లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను నిండా ముంచారని ఉత్తర తెలంగాణను అభివృద్ధి చేసుకొని దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి కమిషన్లు దండుకున్న కేసీఆర్ ఆయన కుటుంబం దక్షిణ తెలంగాణ పై వివక్ష కనబర్చుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో పరిగి మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, యువజన కాంగ్రెస్ శివసేనారెడ్డి, బాలరాజ్ గౌడ్, బాబర్ ఖాన్, రఘు, చౌదరిగుడ మండల అధ్యక్షులు రాజు, కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నందిగామ మండల అధ్యక్షుడు జంగ నరసింహ యాదవ్, కొత్తూరు మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, ఫరూక్నగర్ మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, కేశంపేట్ మండల అధ్యక్షుడు వీరేశప్ప, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, కుమారస్వామి గౌడ్, శ్రీశైలం, సుదర్శన్, బాదేపల్లి సిద్ధార్థ, హనుమంత్ రెడ్డి,అంజేరెడ్డి, వెంకట నరసింహారెడ్డి, జాకారం శేఖర్, సత్యం రెడ్డి, బ్యాటరీ కృష్ణారెడ్డి, అశోక్, అందే మోహన్, ఎస్సీ సెల్ నరేందర్, ఎస్సీ సెల్ రవికుమార్, పద్మారం సర్పంచ్ లక్ష్మి సుధా నర్సింలు, వెంకటేష్, మహిళా అధ్యక్షురాలు పిట్ట రజిత, వజ్రమ్మ, ఎంపీపీ తనయుడు ఆంజనేయులు, ఎజాస్, వేణుగోపాల్, రామకృష్ణరెడ్డి, తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *