వీణవంక:మత్తు పదార్థాలతో
జీవితాలు చిత్తు: సీఐ కిషోర్

సే నో టు డ్రగ్స్ ఎస్సై శేఖర్ రెడ్డి
వీణవంక, జూన్ 26 (విశ్వం న్యూస్) : ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే పురస్కరించుకొని వీణవంక మండల ఎస్సై శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో “మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు” వ్యతిరేకంగా విద్యార్థులతో స్థానిక బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జమ్మికుంట సిఐ కిషోర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… ఓపియం, కొకైన్ హెరాయిన్, మార్ఫిన్, మితాడోన్ వంటి మత్తు పదార్థాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు.

ముఖ్యంగా విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడటం విచారకరమన్నారు. డ్రగ్స్ కి అలవాటు పడడం వల్ల ఆకలి తగ్గిపోవడం,నిద్రలేమి, అల్సర్లు రావడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చేతులు కాళ్లు వనకడం వంటి లక్షణాలు సహజంగా కనిపిస్తాయన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో బడి హాజరు శాతం తగ్గిపోయి చదువుకుంటు పడుతుందన్నారు. డ్రగ్స్ కోసం దొంగతనాలు, దోపిడీ లకు పాల్పడుతున్నారన్నారు. కుటుంబాలలో కొట్లాటలు మొదలై విచిన్నానికి దారితీస్తున్నాయన్నారు. డ్రగ్స్ దొరకని సమయంలో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

ఎస్ఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ… మత్తు పదార్థాలు లభించే ప్రదేశాలకు, వినియోగించే వారికి దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ పారిన పడకుండా పుస్తక పఠనం, సంగీతం లేదా ఏదైనా ఒక పనిలో నిమగ్నం కావాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకోమని ఒత్తిడి చేస్తే సే నో చెప్పటం అలవాటు చేసుకోవాలన్నారు. అవసరమైతే డయల్ 100 కి కాల్ చేయాలన్నారు.
“మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే నష్టాలు – నివారణ చర్యలపై “విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను సీఐ కిషోర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వీణవంక ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.