చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్, మార్చి 13 (విశ్వం న్యూస్): హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మియాపూర్ పరిధిలోని చందానగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అను ఫర్నిచర్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భవనంలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ నిల్వ ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి భారీగా ఎగసిపడుతున్నాయి.
ప్రమాదానికి గురైన భవనం ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు.
ఇక ప్రమాదం నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.