‘కేజీబీవీ బెడ్ల కొనుగోలులో భారీ అవకతవకలు’ – దాసోజు శ్రవణ్

  • తక్కువ స్టీల్… ఎక్కువ బిల్లు!
  • దాసోజు శ్రవణ్ సంచలన ఆరోపణ

హైదరాబాద్, ఫిబ్రవరి 21, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణ విద్యాశాఖ చేపట్టిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (KGBV) బంకర్ బెడ్ల కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ కొనుగోళ్లలో ₹160 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైందని ఆయన అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 45,360 బంకర్ బెడ్ల కొనుగోలుకు ఒక్కో బెడ్‌కు ₹35,830 చొప్పున చెల్లింపులు జరగడం ఆశ్చర్యకరమని దాసోజు శ్రవణ్ అన్నారు. మార్కెట్‌లో ఇదే నాణ్యత గల బెడ్లు ₹12,000 నుంచి ₹15,000 మధ్య లభిస్తుండగా, ప్రభుత్వ టెండర్‌లో ధరలు మూడింతలు పెరగడం వెనుక గట్టి కారణాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో ఒక్కో బంకర్ బెడ్ తయారీలో సుమారు 95 కిలోల స్టీల్ వినియోగించారని, తాజా టెండర్‌లో మాత్రం ఆ బరువును 75 కిలోలకు తగ్గించినప్పటికీ ధరలు పెరగడం తార్కికం కాదని శ్రవణ్ అన్నారు. స్టీల్ పరిమాణం తగ్గితే ధర కూడా తగ్గాల్సిందేనని, కానీ ఇక్కడ తక్కువ స్టీల్‌కు ఎక్కువ బిల్లు వేశారని విమర్శించారు.

టెండర్ అర్హత నిబంధనలను స్థానిక MSME తయారీదారులు పాల్గొనకుండా రూపొందించారన్న అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. గతంలో ఇదే బెడ్లను విజయవంతంగా సరఫరా చేసిన స్థానిక సంస్థలను తప్పించి, బయట సంస్థలకు అనుకూలంగా షరతులు పెట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు.

ఫైనాన్స్ శాఖ, విజిలెన్స్ శాఖల అనుమతులు, మార్కెట్ సర్వే నివేదికలు ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. టెండర్‌కు సంబంధించిన పూర్తి నోట్ ఫైళ్లు కోరుతూ దాఖలైన RTI దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోందని దాసోజు శ్రవణ్ అన్నారు.

కేజీబీవీ పథకం సమగ్ర శిక్ష కింద కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తున్నాయని గుర్తుచేశారు. అందువల్ల ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, దేశ ప్రజల పన్నుల డబ్బుకు సంబంధించిన వ్యవహారమని ఆయన స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, స్వతంత్ర విచారణ చేపట్టాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రజాధనంపై పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *