జవాన్ అనిల్ కు ఘనంగా నివాళులు
అర్పించిన మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ బ్యూరో, మే 6 (విశ్వం న్యూస్) : జమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన పబ్బాల అనిల్ మృతదేహాం సైనిక లాంచనాల మధ్య రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్వగ్రామామైన మల్కాపూర్‌కు చేరుకుంది. మార్గమధ్యమంలో గంగాధర వద్ద ఆయనకు ప్రజలు ఘన నివాళులు అర్పించారు. గంగాధర నుంచి మల్కాపూర్‌కు భారీ జనసందోహం మధ్య యాత్ర కొనసాగింది.
ఇండియన్ ఆర్మీకి చెందిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో.. కిష్ట్వార్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో.. టెక్నీషియన్ అనిల్ మృతి చెందగా.. ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. అనిల్ ఆర్మీలో గత 11 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అనిల్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
అనిల్ గత 15 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. కుటుంబ సభ్యులతో, ఊరి వారితో సరదాగా గడిపి.. ఈ మధ్యే విధుల్లో చేరాడు. కొన్ని రోజులకే ప్రమాదవశాత్తు ఈ దుర్ఘటన జరిగి మృతిచెందాడు. అనిల్ మృతి వార్త విని అటు కుటుంబసభ్యులతో పాటు మొత్తం గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. అనిల్ మృతదేహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ పూల మాలలు వేసి నివాళులర్పించారు.