కదం కదం పర్ లడనా సీకో
హైదరాబాద్, డిసెంబర్ 19 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు కావడంపై వివిధ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి. బీఆర్ఎస్ నేత, తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్ పర్సన్ మంత్రి శ్రీదేవి ఈ కేసును తీవ్రంగా ఖండించారు.
కేటీఆర్ పై కేసు నమోదు చేయడం అన్యాయమని, ఇది రాజకీయ ప్రేరేపిత చర్యగా కనిపిస్తోందని పేర్కొన్నారు.కేటీఆర్ రాష్ట్రానికి మేలు చేయడమే లక్ష్యంగా ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిర్వహించారని, దీనివల్ల హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని చెప్పారు. మంచి పనులు చేస్తున్న నాయకులపై ఇలాంటి కేసులు పెట్టడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ గురించి: ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ నగరం ప్రపంచపటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని అనేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈవెంట్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ నిధుల వినియోగం, పారదర్శకతపై ఆరోపణలు ఎదురవుతున్నప్పటికీ, ఇది రాష్ట్రానికి ప్రోత్సాహకరమైన ప్రాజెక్టుగా పేర్కొంటున్నారు.