ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి పట్ల
ఎమ్మెల్సీ దాసోజు తీవ్ర దిగ్భ్రాంతి

హైదరాబాద్, జూన్ 8 (విశ్వం న్యూస్): జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీనాథ్ మరణ వార్త తలనెత్తిన పిడుగులా ఉందని పేర్కొన్నారు. ఆయన ఉజ్వల రాజకీయ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రజలతో నిత్యం సన్నిహితంగా ఉంటూ సేవలందించిన వినయశీలి నేతగా కొనియాడారు.

“గోపీనాథ్ గారు మరణించడం పార్టీకి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీరనిలోటు. మంచి వ్యక్తిత్వం కలిగిన నేతగా, సామాజిక సమీకరణాలను చక్కగా సమతుల్యం చేసిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. యువతలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు,” అని డాక్టర్ దాసోజు తెలిపారు.

ఈ దుర్ఘటన పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, పార్టీ శ్రేణులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రజాసేవే ధ్యేయంగా పని చేసిన గోపీనాథ్ మరణం నిజంగా రాజకీయ రంగానికి తీరనిలోటు అని పేర్కొన్నారు.