ఇబ్రహీంపట్నం–క్యాతనపల్లి ఘటనలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపాటు

ప్రజా తీర్పుపై అధికార దాడి

  • ఇబ్రహీంపట్నం–క్యాతనపల్లి ఘటనలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపాటు

హైదరాబాద్, ఫిబ్రవరి 21, 2026 (విశ్వం న్యూస్): రాష్ట్రంలో ఫెయిర్ & ఫ్రీ ఎన్నికల భావనను అధికార పార్టీ పూర్తిగా పక్కనపెట్టిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల పేరుతో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల తీర్పును హత్య చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇబ్రహీంపట్నంలో అధికారులు కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య పద్ధతులను విస్మరించి చైర్మన్, వైస్‌ చైర్మన్ ఎన్నికలను నిలిపివేశారని తెలిపారు. బీఆర్ఎస్ బీఫామ్‌పై గెలిచిన కౌన్సిలర్ యాదగిరి ఒక సమావేశానికి హాజరు కాలేదనే కారణంతో కాంగ్రెస్ నేతలు కేసులు పెట్టడం దురుద్దేశపూరితమని అన్నారు.

17వ తేదీన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా పోలీసులు జోక్యం చేసుకుని అడ్డుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. 18వ తేదీన హైకోర్టు ఆదేశాలు వచ్చినా అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడిపై కేసులు నమోదు చేయడం రాజకీయ కక్షసాధింపేనని విమర్శించారు. పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

క్యాతనపల్లి, తొర్రూరులోనూ ఇదే తరహా దమనకాండ కొనసాగుతోందని ఆయన తెలిపారు. క్యాతనపల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను జైలుకు పంపించి, కౌన్సిలర్లపై కేసులు నమోదు చేయడం ద్వారా రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, విప్‌గా ప్రజాసేవ చేసిన బాల్క సుమన్‌ను ఆదిలాబాద్ జైలులో మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా వేధించడం అమానుషమని తీవ్రంగా ఆరోపించారు.

రాష్ట్రంలో 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిచిందని చెబుతున్న ప్రభుత్వం, ఇబ్రహీంపట్నం–క్యాతనపల్లి వంటి చోట్ల ప్రజా తీర్పును ఎందుకు గౌరవించడం లేదని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో వెంటనే చైర్మన్‌ను ప్రకటించి వైస్‌ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని, అలాగే క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్‌ చైర్మన్ ఎన్నికలను తక్షణమే జరపాలని డిమాండ్ చేశారు.

ఈ కీలక అంశంపై ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంబీపూర్ రాజు కలిసి సంబంధిత సెక్రటరీని కలసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *