జనవరి 7 లోపు మోడల్ పాఠశాలలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 31 (విశ్వం న్యూస్) : శనివారం జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలో మన ఊరు మన బడి కార్యక్రమం పై అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ తో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి మన ఊరు మనబడి పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకం మొదటి దశలో మన జిల్లాలో ఎంపికైన 260 పాఠశాలలకు 81 కోట్లు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించామని తెలిపారు. అలాగే మండలానికి రెండు పాఠశాలల చొప్పున మొత్తం 38 మోడల్ పాఠశాలలను ఎంపిక చేసి, వాటి పనులను దాదాపు పూర్తి చేశామన్నారు. ఈ మొత్తం 38 మోడల్ పాఠశాలలను జనవరి 7 లోపు ప్రారంభోత్సవానికి పూర్తిగా సిద్దం చేయాలనీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 38 మోడల్ పాఠశాలలలో విద్యాశాఖ మంత్రి జనవరి 9న రెండు పాఠశాలలను ప్రారంభించే అవకాశం ఉందని, అధికారులు వీటి ప్రారంభోత్సవానికి పాఠశాలలను రంగులతో అందంగా కనబడునట్లు పూర్తిగా సిద్ధం చేయాలనీ ఆదేశించారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పిటిసి, ఇతర ప్రజా ప్రతినిధులు అందరు ఏ ఈ లతో కలిసి, మోడల్ పాఠశాలలను సందర్శించి, పనుల ప్రగతిని పరిశీలించి, పనులు పూర్తి అగునట్లు శ్రద్ద వహించాలన్నారు.