మొయినాబాద్ మోడల్ ప్రజాస్వామ్యానికి ముప్పు: ఎన్నికల సంఘానికి డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు ఫిర్యాదు

హైదరాబాద్, ఫిబ్రవరి 14, 2026 (విశ్వం న్యూస్) : మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ప్రజాస్వామ్య వ్యాపారీకరణపై డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు సమర్పించారు.

ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో నల్లధనం వరదలా పారుతోందని, ఓటర్లను నగదు, బియ్యంతో ప్రలోభపెడుతున్నారని ఆయన ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థి సుమారు రూ.7 కోట్లు ఖర్చు చేసి గెలిచినట్లు Way2Newsలో వచ్చిన కథనాలను ఆయన ప్రస్తావించారు. ఒక్కో ఓటుకు రూ.70 వేల వరకు నగదు, ప్రతి ఇంటికి 25 కిలోల బియ్యం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.

ఇలాంటి చర్యలు ప్రజాప్రాతినిధ్య చట్టం–1951కు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం “ఒక వ్యక్తి–ఒక ఓటు” సూత్రంపై నిలబడితే, ఇప్పుడు ఓటు వేలం పాట సరుకుగా మారిందని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలకే కోట్లు ఖర్చు చేసే వారు ప్రజాసేవకులు కాదని, అధికారాన్ని పెట్టుబడిగా మార్చుకుని ప్రజాధనాన్ని దోచుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో గెలిచిన అభ్యర్థి ఎన్నికల ఖర్చులు, ఆస్తులపై ప్రత్యేక ఆడిటింగ్ నిర్వహించాలని, నిధుల మూలాలపై అవినీతి నిరోధక శాఖ చేత స్వతంత్ర విచారణ జరిపించాలని డాక్టర్ దాసోజు డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10A ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరారు.

ప్రజాస్వామ్యం ధనవంతుల పాలిట బంగారు గనిగా మారకూడదని, ఎన్నికలు వ్యాపారంగా రూపాంతరం చెందకుండా ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *