ములుగు:కుసుమ జగదీశ్ కు
నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

ములుగు, జూన్ 11 (విశ్వం న్యూస్) : ములుగు జిల్లా అడవి మల్లంపల్లి కి వెళ్లి, హఠాన్మరణం చెందిన ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్ పార్థీవ దేహంపై పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగదీష్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, కుసుమ జగదీష్ హఠాన్మరణం బాధాకరమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నిన్న మొన్నటి వరకు కలివిడిగా తిరిగిన జగదీష్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది అన్నారు. వారి మృతి తనకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీష్ చురుకైన పాత్ర పోషించారన్నారు. ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా జగదీష్ నన్ను కలిసినప్పుడల్లా ములుగు ప్రాంత అభివృద్ధికి కావాల్సిన నిధుల గురించే అడిగేవారని గుర్తు చేసుకున్నారు.

రేపు మంత్రి కేటీఆర్ వస్తున్నారని చెప్పారు. సీఎం కెసిఆర్ గారు కూడా ఏదో ఒక సమయంలో వస్తారని అన్నారు. వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.