నాగర్‌కర్నూల్ ఘటన: ప్రజాస్వామ్య హృదయంపై దాడి : డా. శ్రవణ్ దాసోజు

నాగర్‌కర్నూల్ ఘటన: ప్రజాస్వామ్య
హృదయంపై దాడి: డా. శ్రవణ్ దాసోజు

విశ్వం న్యూస్ / హైదరాబాద్, ఫిబ్రవరి 24 : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన అమానుష ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు నెలల పసికందు మృతికి దారితీసిన ఈ ఘటన కేవలం నేరం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖూనీ చేసిన చర్యగా ఆయన అభివర్ణించారు. సొంత జిల్లాలో శాంతిభద్రతలు కాపాడలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత దీనిలో స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.

గుడిలోకి ప్రవేశానికి సంబంధించి తలెత్తిన వివాదాన్ని ఆసరాగా చేసుకుని రాజక (బీసీ) కుటుంబంపై దాడి జరిపి పసికందు ప్రాణాలు తీసిన ఘటన రాష్ట్ర సమాజానికి మాయని మచ్చ అని డా. శ్రవణ్ పేర్కొన్నారు. అధికారం అండతో ఆధిపత్య కుల అహంకారం మళ్లీ తలెత్తుతోందని, సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక పోలీసుల పాత్రపై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు పాలక పక్షానికి ప్రైవేట్ సైన్యంలా మారారని, బాధితులకు న్యాయం చేయాల్సిన బదులు ఎదురు కేసులు పెట్టి వేధించడం పరాకాష్ట అని అన్నారు. “పోలీసులు యూనిఫాం వేసుకున్నారా, లేక అధికార పార్టీ కండువాలు కప్పుకున్నారా?” అంటూ నిలదీశారు.

సొంత జిల్లాలో ఇంత ఘోరం జరిగినా హోంమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి స్పందించకపోవడాన్ని డా. శ్రవణ్ తప్పుబట్టారు. ఆధిపత్య అహంకారం విషసర్పంలా మారి ప్రజాస్వామ్యాన్ని కాటేస్తోందని, ఈ మౌనం నేరస్థులకు కొమ్ముకాయడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన పలు డిమాండ్లు చేశారు. కుల వివక్షతో సామూహిక దాడికి పాల్పడి హత్యకు కారణమైన నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ 103(2) కింద కఠిన చర్యలు తీసుకోవాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ పోలీసులపై సెక్షన్ 248 కింద విచారణ జరిపి సస్పెండ్ చేయాలని కోరారు. అలాగే బాధిత కుటుంబానికి హై-లెవల్ భద్రత, పూర్తి నష్టపరిహారం చెల్లించి, వారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

“అధికార మదంతో అణగారిన వర్గాల గొంతు నొక్కలేరు. ఈ బూట్ల కింద నలిగిపోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు,” అని డాక్టర్ శ్రవణ్ దాసోజు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *