లేని ఖాతా నంబర్ ఆప్షన్
- బ్యాంక్ అకౌంటే అడగకపాయె!..
- అభయహస్తం దరఖాస్తులో లేని ఖాతా నంబర్ ఆప్షన్
- గృహలక్ష్మి, రైతుభరోసా వంటివి అమలెట్ల?
- ప్రజల నుంచి అధికారులకు పలు ప్రశ్నలు
హైదరాబాద్, డిసెంబర్ 29 (విశ్వం న్యూస్) : ఆరు గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు!.. కానీ, ఆ ఒక్క దరఖాస్తుపై అరవై సందేహాలు!! ప్రజాపాలన కార్యక్రమంలో ఇస్తున్న దరఖాస్తులకు సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలున్నా.. ప్రభుత్వం వైపు నుంచి వాటిపై స్పష్టత, తగిన సమాధానం రావడం లేదు.
అనేక ప్రశ్నలు
ఫారంలో బ్యాంకు అకౌంట్ నంబర్ నమోదుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో పథకాలు ఎలా అమలు చేస్తారంటూ అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహిళలకు ప్రతినెలా రూ.2500 సాయం, రైతుభరోసా సాయం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల సాయం కింది అర్హులకు ఆ మొత్తాన్ని బ్యాంకులో నగదు బది లీ పద్ధతిలో జమ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దరఖాస్తులో అకౌంట్ నంబర్‌కు కాలం లేకపోడంతో ప్రజలంతా విస్మయం వ్యక్తం చేశారు. ఈ హామీలను ఏ విధంగా అమలు చేస్తారని మొదటిరోజే అధికారులను ప్రజలు నిలదీశారు. సమాధానాలు చెప్పలేక అధికారులు కూడా చేతులెత్తేశారు.
ఒక ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అందరికీ రూ.2500 ఇస్తారా? లేక ఒక్కరికే ఇస్తారా? అని మహిళలు ప్రశ్నించారు. భర్తకు పింఛన్ వస్తే భార్యకు ఇవ్వరా? అని అధికారులను అడగడం కనిపించింది. రేషన్‌కార్డుల్లో తల్లీకూతుళ్ల పేర్లుండి, కూతురి పెళ్లయిపోతే అత్తగారింటి వద్ద మహాలక్ష్మి డబ్బులు జమ చేస్తారా? లేక తల్లిగారింటి వద్ద దరఖాస్తు చేసుకోవాలా? అన్న ప్రశ్నలు వినిపించాయి. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వితంతు తదితర పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు కూడా అదనంగా 2500 ఇస్తారా? లేక ఏదైనా ఒక్క పెన్షన్ మాత్రమే ఇస్తారా? అన్న సందేహాలను మహిళలు వ్యక్తం చేశారు.
కౌలు రైతుల కాలమ్‌కు సంబంధించి సాగు చేస్తున్న భూమి సర్వే నంబర్‌తోపాటు పాసు పుస్తకం వివరాలు కూడా దరఖాస్తులో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ భూయజమానితో అధికారిక ఒప్పందం లేకుంటే సదరు వివరాలను ఏ విధంగా నమోదు చేయాలని పలువురు కౌలు రైతులు అధికారులను ప్రశ్నించారు.
ఉపాధి హామీలో రైతు కూలీగా జాబ్ కార్డు ఉంటేనే ఏడాదికి ఇచ్చే రూ.12 వేల కోసం దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తులో ఉన్నది. దీంతో జాబ్‌కార్డులు లేని కూలీలు దరఖాస్తు కౌంటర్ల వద్ద అధికారులతో గొడవపడటం కనిపించింది.
సిలిండర్ల రాయితీపై కూడా స్పష్టత లేదు. ఎన్ని సిలిండర్లకు రాయితీ ఇస్తారన్నది చెప్పకుండా ఏటా ఎన్ని సిలెండర్లు వాడుతున్నారని ఫారంలో ప్రశ్న అడిగారు. దీంతో ఎన్ని సిలిండర్లు వాడితే అన్నింటికి రాయితీ ఇస్తారా? లేక కొన్నింటికి మాత్రమే రాయితీ ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నదా? అంటూ అధికారులను దరఖాస్తు దారులు అడగడం కనిపించింది. ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇవ్వడానికి సంబందించి దరఖాస్తులో పోలీసు ఎఫ్‌ఐఆర్ నంబర్ (ఎఫ్‌ఐఆర్), జైలుకు వెళ్లిన వివరాలను నమోదు చేయాలని సూచించారు. అంటే, తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లకుండా శాంతియుతంగా రోజుల తరబడి దీక్షలు చేసినవారికి గుర్తింపు లేదా? అని పలువురు ఉద్యమకారులు ప్రశ్నించారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చే అంశంపై ప్రజల్లో అనేక సందేహాలు కనిపించాయి. అద్దె ఇండ్లలో ఉండేవారికి తమ పేరుతో కనెక్షన్ ఉండదు. మరి యజమానికి ఉచిత విద్యుత్తు వస్తుందా? కిరాయికి ఉండేవాళ్లకు వస్తుందా? అని చాలా మంది ఆరా తీశారు. 200 యూనిట్లపైన వాడుకునే విద్యుత్తుకు మాత్రమే బిల్లు చెల్లించాలా? లేక 200 యూనిట్లు దాటితే మొదటి యూనిట్ నుంచి మొత్తం కలిపి బిల్లు వేస్తారా? అని దరఖాస్తు దారులు ప్రశ్నించారు.
రేషన్‌కార్డులు లేకపోవడంతో తాము ఎలా దరఖాస్తు చేయాలంటూ అధికారులను అడగడం కనిపించింది. ఆధార్‌కార్డు ఉన్నా దరఖాస్తులు తీసుకుంటామని కొంతమంది చెప్పగా.. రేషన్ కార్డు లేకపోతే దరఖాస్తులు తీసుకోబోమని మరికొన్నిచోట్ల అధికారులు, ప్రభుత్వం సిబ్బంది చెప్పడం కనిపించింది.
దరఖాస్తు ఫారాలు దొరకక జిరాక్స్ సెంటర్ల చుట్టూ ప్రజలు తిరగడం కనిపించింది. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు దరఖాస్తు ఫారాలను తమకు సంబంధించిన వారికి మాత్రమే పంచుకొన్నారనే విమర్శలు వినిపించాయి.
దరఖాస్తు చేసేందుకు ఆదాయ, కుల ధ్రు వీకరణ పత్రాల అవసరం లేకపోయినా కొన్నిచోట్ల అధికారులు ఆయా పత్రాలు కావాలని చెప్పడంతో ప్రజలు వాటి కోసం పరుగులు తీశారు. ఇప్పటికే రైతుబంధు తీసుకుంటున్నవారు కూడా రైతుభరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలా? అని రైతులు ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.