కేసీఆర్ పేరు కాదు.. తెలంగాణ సింహనాదం!

హైదరాబాద్, ఫిబ్రవరి 2, 2026 (విశ్వం న్యూస్) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు. కేసీఆర్‌పై జరుగుతున్న రాజకీయ కక్షసాధింపు చర్యలను ఖండిస్తూ ఆయన ఒక ఘాటైన బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో సీఎం రేవంత్ రెడ్డి తీరును “దురహంకార రాజకీయాలు”గా అభివర్ణిస్తూ, “తస్మాత్ జాగ్రత్త” అంటూ గట్టి హెచ్చరిక జారీ చేశారు.
కేసీఆర్ అంటే కేవలం మూడు అక్షరాల పేరు కాదని, అది “తెలంగాణ సింహనాదం”, ఈ జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని డాక్టర్ శ్రవణ్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఒక వ్యక్తి కాదని, అజేయమైన శక్తి అని పేర్కొంటూ, తెలంగాణ అస్తిత్వ జ్వాల అయిన కేసీఆర్‌ను ఆర్పాలనుకుంటే రేవంత్ రెడ్డి అహంకారమే భస్మమవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అధికారం శాశ్వతం కాదని, అది కేవలం ఐదేళ్ల “అద్దె ఇల్లు” మాత్రమేనని గుర్తు చేస్తూ, అధికారాన్ని ప్రత్యర్థుల గొంతు కోసే కత్తిలా వాడితే అదే కత్తి చివరకు పాలకుల మెడకే చుట్టుకుంటుందని హెచ్చరించారు. పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్‌పై అసభ్య పదజాలంతో దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
చేతనైతే కేసీఆర్ కంటే అన్ని రంగాల్లో మెరుగైన విజయాలు సాధించి చూపాలని సవాల్ విసిరిన డాక్టర్ శ్రవణ్, చరిత్ర పాఠాలు తిరగేస్తే అణగదొక్కే ప్రయత్నాలు ప్రజల్లో వెయ్యిరెట్లు సానుభూతిని పెంచుతాయని గుర్తుచేశారు. సూర్యుడిపై ఉమ్మివేయడం అంటే తన మూర్ఖత్వాన్ని తానే బయటపెట్టుకోవడమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పాలకుల అహంకారానికి, ప్రజల ఆత్మాభిమానానికి మధ్య జరిగే పోరులో ఎప్పుడూ ప్రజల ఆత్మాభిమానమే గెలుస్తుందని స్పష్టం చేసిన ఆయన, ప్రత్యర్థులను హింసించే పాలకులను చరిత్ర “రాజకీయ విలన్”గానే గుర్తుపెట్టుకుంటుందని హెచ్చరించారు. అధికారం పోయిన తర్వాత కూడా ప్రజలు గౌరవంగా చూడగలగడమే అసలైన విజయమని డాక్టర్ శ్రవణ్ దాసోజు తన బహిరంగ లేఖలో స్పష్టం చేశారు.