రైసింగ్ కాదు… ఫాలింగ్ తెలంగాణ:దాసోజు శ్రవణ్

హైదరాబాద్, ఫిబ్రవరి 5, 2026 (విశ్వం న్యూస్): విద్య రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక–తెలంగాణ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విద్యకు 20 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్య రంగానికి అరకొర నిధులు మాత్రమే కేటాయిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇది “రైసింగ్ తెలంగాణ కాదు… ఫాలింగ్ తెలంగాణ” అని వ్యాఖ్యానించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు.

విద్య, వైద్య రంగాలపై చేసే ఖర్చులను వ్యయంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడులుగా చూడాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అవసరమైన నిధులు లేకుండా పోయాయని, మరోవైపు ప్రైవేటు పాఠశాలలపై నియంత్రణ లేకపోవడంతో విద్య రంగంలో విచ్చలవిడితనం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడులకు నిధులు లేకపోవడం, ప్రైవేటు బడులపై నియంత్రణ లేకపోవడం వల్ల విద్య రంగం గందరగోళ స్థితికి చేరుకుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే ప్రజాపాలన, పారదర్శకత కేవలం మాటలకే పరిమితమైందని, హామీలు నెరవేర్చకుండా దాటవేత ధోరణిని అవలంబిస్తోందని విమర్శించారు.
ప్రభుత్వానికి నిజాయితీ లేకపోవడం వల్లే కేంద్రం నుంచి నిధులు రావడం లేదని ఆరోపించారు. నిజాయితీ లోపం, నిధుల కొరత, నియంత్రణ లేకపోవడం కలిసి విద్య రంగాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్క స్పష్టమైన విద్యా విధానాన్ని రూపొందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. మెస్సితో ఫుట్‌బాల్ ఆడేందుకు, ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించేందుకు బడ్జెట్ కేటాయించే ప్రభుత్వం, విద్య రంగానికి మాత్రం తగిన నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. ప్రొఫెసర్ కోదండరామ్‌ను విద్యాశాఖ మంత్రిగా నియమిస్తే వచ్చే నష్టం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్లతో హార్డ్‌వేర్ యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతున్నారని, కానీ రాష్ట్రంలోని పేద విద్యార్థుల కోసం మాత్రం తగిన నిధులు కేటాయించడం లేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు.