అర్థశతాబ్దం తరువాత పాత బడి వద్ద పాత జ్ఞాపకాలు

నాగారం | ఫిబ్రవరి 01 (విశ్వ న్యూస్) : చేతిలో పుస్తకం, మనసులో కలలు, కళ్లలో భవిష్యత్తుతో బడి గడప దాటిన రోజులు—అవి అర్థశతాబ్దం గడిచినా చెరిగిపోలేదు. నాగారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఆదివారం ఆ జ్ఞాపకాలు మళ్లీ జీవించాయి.

1974–75, 1975–76 విద్యా సంవత్సరాల్లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు, పదవ తరగతి పూర్తి చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భావోద్వేగాలతో సమ్మేళనం నిర్వహించారు. ఒకే బెంచ్, గంట మోగితే పరుగులు, పరీక్షల టెన్షన్, గురువుల కఠినత వెనుక దాగిన ఆప్యాయత—అన్నీ ఒక్కసారిగా కళ్లముందు మెదిలాయి.
ఈ సందర్భంగా ఆనాటి గురువు యట్టం రామచంద్రయ్యను సాలువ, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. “విద్యార్థులే గురువులకు నిజమైన బహుమతి” అని ఆయన చెప్పిన మాటలు అందరి హృదయాలను తాకాయి.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుంటకండ్ల రామచంద్రారెడ్డి, పూర్వ విద్యార్థులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కడియం రామచంద్రయ్య, గుంటకండ్ల రమేష్ రెడ్డి, గుంటకండ్ల ముకుందరెడ్డి, పాశం యాదవరెడ్డి, మోదుగు ముత్యం రెడ్డి, చిట్యాల శుభాదేవి, చంద్రకళ, శకుంతల, సుజాత, మోహన్ కృష్ణమాచార్యులు, కలీల్, జూలూరు పార్వతమ్మ, మనోహర తదితరులు పాల్గొన్నారు.
కాలం ఎంత దూరం తీసుకెళ్లినా బాల్యస్నేహాలు చెరిగిపోవని నిరూపించిన ఈ రోజు, పాత పాఠశాల గోడల మధ్య జ్ఞాపకాలే నిజమైన సంపదగా నిలిచిన అపూర్వ సమ్మేళనంగా నిలిచింది.