గద్దర్‌ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్, జూలై 28 (విశ్వం న్యూస్) : గత కొంత కాలంగా గద్దర్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. చికిత్స కోసం ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంకా కొన్ని పరీక్షల అనంతరం గద్దర్‌కు గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేస్తారని సన్నిహితులు ద్వారా తెలిసింది.
గద్దర్ ఆసుపత్రిలో చేరిన విషయం తన సన్నిహితుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి దైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని సూచించారు. గద్దర్‌తో దాదాపు పావు గంటకు పైగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఏపీ రాజకీయాలపైనా, జనసేన పార్టీ నిర్వహిస్తున్న యాత్రపైన గద్దర్ తో చర్చించారని సమాచారం.
గద్దర్ కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీతో కలిసి ఖమ్మం బహిరంగ సభలో గత కొన్నిరోజుల క్రితం పాల్గొన్నారు. అప్పటి నుంచి గద్దర్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఖమ్మం సభ తరువాత నుంచి గద్దర్ పూర్తిగా ఆసుపత్రికే పరిమితమయ్యారు. గద్దర్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజా క్షేత్రంలో తన ఆట, మాట, పాటతో అలరించాలని కోరుకుందాం.