ప్లాంట్‌పై చర్యలు తీసుకోవాలని మండల ప్రజల డిమాండ్

  • నిబంధనలు ఉల్లంఘిస్తున్న
    యాజమాన్యం –
    మౌనంగా అధికారులు
  • వాహనదారులు, గ్రామస్తులకు
    తీవ్ర ఇబ్బందులు
  • రైతుల పంటలపై దుమ్ము ముప్పు – ఆందోళనలో రైతులు

నాగారం, మార్చి 15 (విశ్వం న్యూస్): నాగారం మండల పరిధిలోని నాగారం బంగ్లా వద్ద హెచ్‌పి పెట్రోల్ బంక్ సమీపంలో, సూర్యాపేట–జనగాం జాతీయ రహదారి వెంట రహదారి నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక క్రషర్ థార్ ప్లాంట్ స్థానిక ప్రజలకు శాపంగా మారింది. ప్లాంట్ నుంచి ఎగిసిపడుతున్న భారీ దుమ్ము కారణంగా వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రత్యేకంగా రోజంతా దుమ్ము గాలిలో కలసి రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దుమ్ము కమ్మేయడంతో వాహనదారులు స్పష్టంగా రహదారి కనిపించక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతుల పంటలకు దుమ్ము ముప్పు : క్రషర్ ప్లాంట్ నుంచి ఎగిసిపడుతున్న దుమ్ము సమీప గ్రామాల పొలాలపై పడుతూ రైతుల పంటలకు కూడా నష్టం కలిగిస్తోంది. పంటలపై దుమ్ము పేరుకుపోవడంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కష్టపడి సాగు చేస్తున్న రైతులకు ఇది మరో భారంగా మారిందని చెబుతున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యం: ప్లాంట్ యాజమాన్యం కాలం చెల్లిన యంత్రాలను ఉపయోగించడం వల్లే దుమ్ము అధికంగా వస్తోందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ నిబంధనలు పాటించకుండా ప్లాంట్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

పత్రికల్లో వార్తలు వచ్చినా స్పందన లేదు: ఈ సమస్యపై ఇప్పటికే పత్రికల్లో వార్తలు ప్రచురితమైనప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రజల ప్రాణాలు అంటే అధికారులకు అంత అలుసా అని మండల మేధావులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అధికారులు మామూళ్ల మత్తులో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్: ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి క్రషర్ థార్ ప్లాంట్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్లాంట్‌ను వెంటనే మూసివేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

పరిశీలిస్తామని ఎంపీడీవో హామీ: ఈ విషయంపై స్పందించిన ఎంపీడీవో మాట్లాడుతూ సోమవారం తహసీల్దార్ సమక్షంలో క్రషర్ థార్ ప్లాంట్‌ను సందర్శించి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం పూర్తి నివేదికను జిల్లా అధికారులకు పంపించి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *