ఏసీటీవోలకు గజిటెడ్ హోదా కోసం వినతి

హైదరాబాద్, జనవరి 12 (విశ్వం న్యూస్) : తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజిటెడ్ హోదా అంశంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుండి పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యపై ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం బాధకరమని ఆయన తెలిపారు.

ఏసీటీవోలకు గజిటెడ్ హోదా కల్పించడానికి గతంలో పలు కమిషన్లు సిఫార్సులు చేసినప్పటికీ, ఈ అంశం ఇప్పటివరకు పరిష్కారానికి రాలేదన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో జీవో నెంబర్ 212 ద్వారా ఏసీటీవోలకు గజిటెడ్ హోదా కల్పించినట్లు పేర్కొన్న ఆయన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తున్నప్పటికీ ఈ హోదా ఇప్పటివరకు అమలు చేయకపోవడం అన్యాయమని అభిప్రాయపడ్డారు.

ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, ఎక్సైజ్ మరియు వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజ్వి, ఇతర సంబంధిత శాఖల వద్ద ఫైలు పెండింగ్‌లో ఉందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని వెంటనే ఈ అంశాన్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఏసీటీవోలకు గజిటెడ్ హోదా కల్పించబడగా, తెలంగాణలో ఇప్పటివరకు అమలు కానప్పటికి బాధను వ్యక్తం చేస్తూ, వివిధ రాజకీయ పార్టీల శాసన సభ్యులు, మంత్రుల వద్ద వినతులు పెట్టినట్లు తెలిపారు. ఈ ఫైలు ఇప్పటికీ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో పెండింగ్‌లో ఉందన్నారు.

మజిలీస్ పార్టీ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు మరియు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకసారి అసెంబ్లీలో ఏసీటీవో హోదా గురించి ప్రశ్నించినప్పటికీ, ఇప్పటివరకు వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు న్యాయం జరగలేదని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ మద్దతు:
ఈ సమస్యపై న్యాయం కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి, వాణిజ్య పన్నుల శాఖలోని ఏసీటీవోలకు గజిటెడ్ హోదా కల్పించడానికి మద్దతు కోరారు. మద్దతు తెలిపిన ప్రముఖులు:

మంత్రులు: పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ
ప్రభుత్వ విప్: ఆది శ్రీనివాస్
ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు: అసదుద్దీన్ ఓవైసీ
బీజేపీ శాసన పక్ష నేత: అల్లాటి మహేశ్వర్ రెడ్డి
సీపీఐ నేత: కొనమని సాంబశివరావు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే: డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: జి. వెంకట్ స్వామి, జి. వినోద్
ఎమ్మెల్సీ: టి. జీవన్ రెడ్డి
వీరంతా లేఖల ద్వారా తమ మద్దతు తెలియజేసినప్పటికీ, ఏసీటీవోలకు గజిటెడ్ హోదా ఇప్పటికీ అందకపోవడం బాధాకరమని హుస్సేన్ గారు పేర్కొన్నారు.

మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేస్తూ, అన్ని రాజకీయ పార్టీల మద్దతు పొందే ప్రయత్నం చేసినప్పటికీ, సమస్య ఇంకా పరిష్కారం కాకపోవడం విచారకరమని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *