ఆడవేషంలో వచ్చి
ఫ్రెండ్ ఇంట్లోచోరీ

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విశ్వం న్యూస్) : హైదరాబాద్‌లో మహిళ వేషం వేసుకుని దొంగతనానికి పాల్పడిన యువకుడు చివరికి పోలీసులకు దొరికిపోయాడు. బంజారాహిల్స్ ఉదయ్‌నగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే—ఉదయ్‌నగర్‌లో నివాసం ఉండే శివరాజ్ ఈ నెల 16న కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్ వెళ్లాడు. ఈ విషయాన్ని అతని కుమారుడు తన స్నేహితుడు, లింగంపల్లి నివాసి హర్షిత్‌తో ఫోన్‌లో మాట్లాడుతుండగా చెప్పాడు. హర్షిత్ సీసీ కెమెరా టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.
అయితే మరుసటి రోజు శివరాజ్ కుటుంబం తిరిగి ఇంటికి చేరుకోగా ఇంటి తాళం పగలగొట్టి, అల్మారాలోని 6.75 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.10 లక్షల నగదు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో ఓ మహిళ ఇంటిలోకి వెళ్లి బయటకు వచ్చినట్లు కనిపించగా, ఆమే దొంగ అని అనుమానించారు. అయితే పూర్వ ఫుటేజీల్లో స్థానికంగా కెమెరాలను గమనిస్తున్న వ్యక్తి కనబడగా, అతడిని శివరాజ్ కుమారుడు తన స్నేహితుడు హర్షిత్‌గా గుర్తించాడు.
దీంతో పోలీసులు లింగంపల్లిలోని హర్షిత్ ఇంటిపై సోదాలు నిర్వహించి, రూ.6.75 తులాల బంగారు ఆభరణాలు, రూ.85 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరిశీలనలో హర్షిత్ తన తప్పు ఒప్పుకుని, మహిళ వేషంలో వెళ్లి దొంగతనం చేశానని అంగీకరించాడు. లోన్ యాప్స్‌లో అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఇలాంటి ఆలోచన వచ్చిందని తెలిపాడు. దొంగిలించిన డబ్బులో రూ.25 వేల్ని అప్పు తీర్చడానికి వినియోగించినట్లు చెప్పాడు.
ప్రస్తుతం నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది.