భక్తి పేరిట భుక్తి రాజకీయం?- సర్కారు నిర్ణయాలపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్

హైదరాబాద్, మార్చి 28 (విశ్వం న్యూస్): పేదవాడి బిడ్డ చదువుకునే సర్కారు పాఠశాలలకు సరిపడా నిధులు కేటాయించలేని పరిస్థితిలో ప్రభుత్వం గుడి నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందిస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రశ్నలు లేవనెత్తారు.

“సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు లేవు… పిల్లలకు కనీస వసతులు కల్పించలేకపోతున్నాం. కానీ గుడి నిర్మాణానికి వందల కోట్లు ఖర్చు చేయడం ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు. ప్రజల పన్నుల రూపంలో వచ్చిన డబ్బును విద్య, వైద్యం వంటి అత్యవసర రంగాలకు కాకుండా ఇలాంటి ప్రాజెక్టులకు మళ్లించడం సరైందా అని నిలదీశారు.

ఈ ఖర్చు నిజంగా దేవుడిపై ఉన్న భక్తి కోసం చేస్తున్నదా? లేక దేవాలయ ఆస్తులపై కన్నేసిన వారి స్వార్థ ప్రయోజనాల కోసమా? అంటూ ఆయన విమర్శించారు. “ప్రజల సొమ్ముతో ఆధ్యాత్మిక రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? లేక ఆస్తుల వేట కోసం ఇది ఒక మార్గమా?” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకతతో ముందుకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలని, నిధుల వినియోగంపై స్పష్టత ఇవ్వాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *