మెహదీపట్నం స్కైవేపై ప్రధాని
తీపికబురు అందించాలి
- త్వరలో మల్లంపేట్ వద్ద 21వ ఇంటర్ చేంజ్
- మూసిపై బ్రిడ్జ్ లకు త్వరలో శంకుస్థాపన
- రూ.10వేల కోట్లతో మూసిపై ఎక్స్ప్రెస్ స్కై వే ప్రతిపాదన
- నార్సింగి ఇంటర్ చేంజ్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీ రామారావు
హైదరాబాద్, జూలై 1 (విశ్వం న్యూస్) : ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పైన మరొక ఇంటర్ చేంజ్ మల్లంపేట వద్ద అందుబాటులోకి తీసుకురానున్నట్లు పురపాలక శాఖ మంత్రి శ్రీ కె.టి.రామారావు గారు వెల్లడించారు. శనివారం ఉదయం నార్సింగి పోలీస్ స్టేషన్ సమీపంలో రూ.29.50 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) నిర్మించిన ఇంటర్ చేంజ్ ను పురపాలక శాఖ మంత్రి శ్రీ కె టి రామారావు గారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, శంబిపూర్ రాజు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హెచ్ఎండిఏ ఏర్పాటుచేసిన సభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ ఎంతో ఉపయుక్తంగా ఉందని, ఔటర్ చుట్టూ పెరుగుతున్న జనసాంద్రతను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ మరికొన్ని ఇంటర్ చేంజ్ లను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నార్సింగి ఇంటర్ చేంజ్ తర్వాత త్వరలో ఔటర్ పై 21వ ఇంటర్ చేంజ్ మల్లంపేట వద్ద అందుబాటులోకి తీసుకురా అన్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగరం చుట్టూ పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లను ఫోర్ లైన్ రోడ్లుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారని, సీఎం గారి ఆదేశాల మేరకు ఔటర్ సర్వీస్ రోడ్ల విస్తరణ చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మెట్రో రైలును బీహెచ్ఈఎల్, ఫార్మాసిటీ, కందుకూరు వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ గారు ఆదేశించారని, ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ గ్రోత్ స్టార్ ఇప్పుడే మొదలైందని, ఇకముందు సీఎం కేసీఆర్ గారి ఆలోచనల మేరకు ఎన్నెన్నో ప్రణాళికలు ఆచరణ రూపం దాలుస్తాయని కేటీఆర్ చెప్పారు. మూసీనది అభివృద్ధికి వినూత్న ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలో మూసిపై బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మొత్తం 14 బ్రిడ్జిలలో ఐదు బ్రిడ్జిల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందని తెలిపారు. మూసిపై సుమారు రూ.10వేల కోట్ల వ్యయంతో 55 కిలోమీటర్ల మేరకు ఎక్స్ ప్రెస్ స్కై వే నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు.
ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో హైదరాబాద్ పౌరుల సౌకర్యార్థం మెహదీపట్నం స్కైవాక్ నిర్మాణం కోసం అరఎకరం రక్షణశాఖ స్థలాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ప్రధాని నరేంద్ర మోది రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా మావినతులపై తీపికబురు అందించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరో రెండున్నర సంవత్సరాలలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు.