బీహార్ లో ఓటు చోరీ అంటూ రాహుల్ గాంధీ గగ్గోలు

  • రేవంత్ రాజకీయాలకు
    దళిత స్పీకర్ బలి
  • తెలంగాణలో అయితే ఎమ్మెల్యే చోరీ
    జరుగుతున్నా… రాహుల్
    ఎందుకు సైలెంట్?
  • రేవంత్ వైఖరి రాజ్యాంగ ద్రోహం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

హైదరాబాద్‌, నవంబర్‌ 18 (విశ్వం న్యూస్) : దేశమంతా తిరిగి తనను రాజ్యాంగ సంరక్షకుడినని చెప్పుకునే రాహుల్ గాంధీ… తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలపై మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా నిశ్శబ్దం పాటిస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ‘చిల్లర డ్రామా’ నడుపుతున్నారని ఆయన ఆరోపించారు.

సుప్రీంకోర్టు హెచ్చరికను కూడా
పట్టించుకోని ప్రభుత్వం

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, స్పీకర్ ఇద్దరూ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు. రీజనబుల్ టైమ్ అంటే ఎప్పటివరకూ అన్న ప్రశ్నకు స్పీకర్ సమాధానం చెప్పాలన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా “క్రొత్త సంవత్సరం జైల్లో గడపాలా?” అని హెచ్చరించినా ప్రభుత్వం కదలడం లేదని అన్నారు.

“గడ్డం ప్రసాద్ ధర్మాత్ముడు —
రేవంత్ ఒత్తిడికి తలొగ్గవద్దు!”
దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంచి వ్యక్తి, ధర్మాత్ముడని శ్రవణ్ అన్నారు.
కానీ రేవంత్ రెడ్డి ఆధిపత్య రాజకీయాలకు స్పీకర్ బలి అవుతున్నారన్నది ఆయన ఆందోళన.
మౌలంకార్ లాంటి స్పీకర్లు ప్రధాని వరకూ హెచ్చరించే ధైర్యం చూపారని గుర్తుచేశారు.

“బీహార్‌లో ఓటు చోరీ అంటే గగ్గోలు…
ఇక్కడ ఎమ్మెల్యే చోరీపై నోరు తెరవరు?”
బీహార్‌లో ఓటు చోరీ అంటూ గోల చేసే రాహుల్ గాంధీ, తెలంగాణలో ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ మారుతున్నా సైలెంట్‌గా ఉండటం ఆశ్చర్యమన్నారు. ఫిరాయింపుల చట్టాన్ని కాపాడతామని కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో మాట ఇచ్చింది కదా… అయితే ఇక్కడ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు.

“అనర్హత వేటు వేయించేందుకు
రేవంత్‌కి ధైర్యం లేదు”
జూబ్లీహిల్స్‌లో బోగస్ ఓట్లతో గెలిచి సంబరాలు చేసుకునే రేవంత్ రెడ్డి… పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడానికి మాత్రం ధైర్యం చూపడంలేదన్నారు.
వెస్ట్ బెంగాల్‌లో ముకుల్ రాయ్‌పై హైకోర్టు ఎలా అనర్హత వేటు వేసిందో, మణిపూర్‌లో ఆరుగురు ఎమ్మెల్యేలు ఎలా అర్హత కోల్పోయారో ఉదాహరణలు చూపించారు.

“8 మంది ఎమ్మెల్యేలకు ధైర్యం
ఇచ్చింది రేవంత్ చిల్లర రాజకీయాలే”
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న కిచెన్ పాలిటిక్స్ కారణంగా… పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలలో ధైర్యం పెరిగిందని శ్రవణ్ అన్నారు.
“అవారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావు… అయినా వారికి ఆశ్రయం ఇస్తున్నారు. ఇదేనా రాజ్యాంగ పరిరక్షణ?” అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి వ్యవహారం రాజ్యాంగ ద్రోహం స్థాయికి చేరిందని, స్పీకర్ పవిత్రతను మంటకలపొద్దని, వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *