ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

- తోబుట్టువుల ప్రేమానుబంధాలకు ప్రతీక పర్వదినం
విశ్వం న్యూస్ / తిమ్మాపూర్, ఆగస్టు 9: ప్రేమ, అనురాగం, అనుబంధం, ఆత్మవిశ్వాసం… అన్నీ సమపాళ్లలో కలిసిన బంధమే రక్తసంబంధం. ఎల్లలు లేని ప్రేమకు, వెలకట్టలేని విలువలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగ నిలుస్తుంది. తోబుట్టువుల మధ్య పవిత్రమైన ఈ పండుగను ప్రతి సంవత్సరం ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవాయితీ.
శనివారం రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా తిమ్మాపూర్ మండలంలోని గ్రామాల్లో ఇంటి ఆడపడుచులు తమ సోదరుల ఇళ్లకు వెళ్లి రాఖీ కట్టి, జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. సోదరులు కూడా ఎల్లప్పుడూ అండగా, రక్షణగా ఉంటానని హామీ ఇస్తూ, చెల్లెల్లను ఆశీర్వదించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగను సందడిగా జరుపుకున్నారు.
రాఖీ పర్వదినం నేపథ్యంలో స్థానిక దుకాణాలు, వ్యాపార కేంద్రాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. గ్రామాల మధ్య రాకపోకలు పెరగడంతో ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ గణనీయంగా కనిపించింది.