మతసామరస్యానికి
ప్రతీకగా రంజాన్ వేడుకలు

హుజురాబాద్, మార్చి 18 (విశ్వం న్యూస్): పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన దావత్-ఎ-ఇఫ్తార్ విందులో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ మాసం కేవలం పండుగ మాత్రమే కాకుండా మానవతా విలువలను గుర్తుచేసే పవిత్ర మాసమని తెలిపారు.

నెలరోజుల పాటు ఉపవాస దీక్షతో ఆత్మశుద్ధి సాధిస్తూ, పరులకు సహాయం చేయడం, పరస్పర సత్సంబంధాలను పెంపొందించుకోవడం రంజాన్ మాసం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. హుజురాబాద్ పట్టణంలో ముస్లిం సోదరులతో కలిసి దావత్-ఎ-ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జామే మస్జిద్ ఈద్గా, ఖబ్రస్తాన్ మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, మస్జిద్-ఎ-బషీర్ అధ్యక్షుడు షేక్ ఫయాజ్, మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు ముఫ్తీ అమీర్ బాబా, హఫీజ్ ఇమ్రాన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున హాజరై ఇఫ్తార్ విందును సౌహార్ద వాతావరణంలో నిర్వహించారు.
