హుజురాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు

హుజురాబాద్, మార్చి 21 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ పట్టణంలో రంజాన్ పండుగను ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత గురువు ముఫ్తీ షాకీర్ రంజాన్ పండుగ ప్రాముఖ్యతను వివరించి, ఖురాన్‌లో చెప్పిన ఉపదేశాలను ప్రతి ముస్లిం తప్పక పాటించాలని సూచించారు. పేదలకు సహాయం చేయడం, ధనిక-పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ప్రార్థనలు ముగిసిన అనంతరం చిన్నా పెద్ద తేడా లేకుండా ముస్లింలు ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా జామే మస్జిద్ ఈద్గా & ఖబరస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, పండుగ ఏర్పాట్లలో భాగంగా షామియానా, సౌండ్ సిస్టమ్ వంటి సదుపాయాలు కల్పించిన హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన ఏసీపీ మాధవి, సీఐ కరుణాకర్ గౌడ్ మరియు పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ ప్రత్యేక ప్రార్థనల్లో మత గురువు ముఫ్తీ షాకీర్, జామే మస్జిద్ ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యులు, ముస్లిం నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.